ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏవీ?: మోడీపై రాహుల్ ఆగ్రహం

rahul
ఎం| Last Updated: గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:08 IST)
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. అనేక దేశాలతో సంబంధాలను మోడీ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాలతో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ పటిష్ట సంబంధాలను కొనసాగిస్తే…దానిని మోడీ ఇప్పుడు విచ్ఛిన్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మిత్రులు లేకుండా ఇరుగుపొరుగుతో జీవించడం అత్యంత ప్రమాదకరమని రాహుల్‌ పేర్కొన్నారు. ట్విట్టర్‌ వేదికగా మోడీ సర్కారుపై రాహుల్‌ ధ్వజమెత్తుతూ…బంగ్లాదేశ్‌తో భారత్‌ సంబంధాలు బలహీనపడగా చైనాతో సంబంధాలు పటిష్టవంతమయ్యాయని ఓ ఆర్థికవేత్త రాసిన వ్యాసాన్ని రాహుల్‌ ట్వీట్‌కు జత చేశారు.

ఇరుగుపొరుగుతో మైత్రీబంధం లేకపోతే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలు బలహీనపడ్డాయని ఆక్షేపించింది.

ఈ ఆరోపణలను మోడీ సర్కారు తోసిపుచ్చింది. చాలా దేశాలతో భారత్‌ సంబంధాలు బలంగా ఉన్నాయని, ప్రపంచంలో భారత్‌ శక్తివంతంగా తయారవుతుందని కేంద్రం చెప్పుకుంటుంది.
దీనిపై మరింత చదవండి :