ప్రభుత్వ ఉద్యోగులు - ప్రజాప్రతినిధులు తదితర పబ్లిక్ సర్వెంట్స్ పై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అంబుడ్స్ మన్ లాంటి ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగసంస్థ ఏర్పాటు అవసరం అంటూ 1966లో కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన Administrative Reforms Commission సూచించింది. దానికి అనుగుణంగానే ఈ "లోకాయుక్త - ఉప లోకాయుక్త" సంస్థలను ఆయారాష్ట్రాల్లో ఏర్పాటుచేశారు.
1983 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటైంది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా, ప్రజా సమస్యలపైనా, పాలనాపరమైన సమస్యలపైనా ఇలా చాలా అంశాల్లో ఫిర్యాదుచేసే అవకాశం ప్రజలకు ఈ లోకాయుక్త కల్పిస్తుంది. లోకాయుక్త & ఉపలోకాయుక్త ఈ రెండూ వేర్వేరు ధర్మాసనాలు.
ఏదైనా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని లోకాయుక్తగానూ, మరొక జిల్లా జడ్జిని ఉపలోకాయుక్త గానూ గవర్నర్ నియమిస్తారు. ఈ లోకాయుక్త అనేది ఒక స్వతంత్రసంస్థ. దీనివ్యవహారాల్లో ప్రభుత్వ పాలనాయంత్రాంగం ఏమాత్రమూ వేలుపెట్టే వీలులేదు. ప్రభుత్వ నియంత్రణ అన్నది ఏమాత్రమూ ఉండదు.
దీంట్లో ప్రజలు ఎవరైనా సులభంగా ఫిర్యాదుచేయవచ్చు. అప్లికేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అప్లికేషన్ నింపడం రాకపోయినా జస్ట్ ఒక తెల్లకాగితం మీద ఫిర్యాదును రాసిస్తే సరిపోతుంది. ఫీజుకూడా నామమాత్రమే. ఎవరికేసులను వాళ్ళే స్వయంగా వెళ్లి వాదనలను వినిపించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇక లోకాయుక్త /ఉప లోకాయుక్త పరిధిలోకి వచ్చే అంశాలు చూస్తే:
- అధికార దుర్వినియోగంవల్ల వ్యక్తిగత లాభం పొందేవిధంగా లేక ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండేలా తీసుకొన్న పాలనాపరమైన చర్యలు.
- పాలనాపరమైన చర్యలవలన అనినీతి జరిగినా లేక అది మరేఇతర దురుద్దేశ్యాలతో కూడుకొన్నా.
- పాలనాపరమైన చర్యలవల్ల ప్రభుత్వానికిికానీ, వ్యక్తులకుకానీ ఏవిధమైన ఇబ్బందులు కలిగినా, నష్టం జరిగినా.
- పూర్తిగా అవినీతితో కూడుకొన్న చర్యలు లేదా అసంబద్ధంగా/అన్యాయంగా ఉన్నా.
ఇటువంటి అన్ని సందర్భాలలోనూ, తగిన ఆధారాలతో ప్రజలు ఎవరైనా లోకాయుక్త వారికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇకపోతే, లోకాయుక్త/ఇప లోకాయుక్త లు ఫిర్యాదులను మూడువిధాలుగా స్వీకరిస్తారు.
ప్రజలు నేరుగా చేయడం - వార్తల్లో వచ్చిన అంశాల ఆధారంగా, లేదా లేఖల ఆధారంగా లోకాయుక్త/ఉపలోకాయుక్త వారే సుమోటోగా - గవర్నర్ గారి రిఫరెన్స్ తోనూ ఇలా మూడువిధానాల్లో ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ లోకాయుక్త సంస్థలో అడ్మినిస్ట్రేషన్ - జ్యూడిషల్ - లీగల్ - ఇన్వెస్టిగేషన్ ఇలా నాలుగు విభాగాలు ఉంటాయి.
ఈ క్రిందివారిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయవచ్చు..
ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, శాసనసభ సభ్యులు (MLA), శాసనమండలి సభ్యులు (MLC), చీఫ్ విప్, ప్రభుత్వ విభాగాల్లో నామినేట్ చేయబడినవారు, జిల్లా పరిషత్ చైర్మెన్/వైస్ ఛైర్మెన్, మండల పరిషత్ అధ్యక్షుడు, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపాలిటీ ఛైర్మెన్, కోఆపరేటివ్ సొసైటీ ఛైర్మెన్/ప్రెసిడెంట్/డైరెక్టర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్, స్థానిక సంస్థలు/యూనివర్సిటీలు ఇంకా ఇతర చట్టబద్ధమైన సంస్థలు లేదా కార్పొరేషన్లు ఇతర సంస్థల్లో పనిచేసేవారు అన్నిరకాల ప్రజాప్రతినిధులు.
ఇలా ప్రజాసేవలో ఉన్నవాళ్లు అందరూ లోకాయుక్త పరిధిలోనికి వస్తారు. ప్రజలు నేరుగా వారి ఫిర్యాదులను ఆధారాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఫిర్యాదు తాలూకు ఆరోపణలు ఆరేళ్లకు మించకుండా ఉండాలి. ఎప్పుడో ఆరేళ్లక్రితం జరిగిన విషయాంన్ని ఇప్పుడు ఫిర్యాదు చేస్తాను అంటే అలాంటి ఫిర్యాదులను స్వీకరించరు.
పాలకుడు తనపాలననూ - తన యంత్రాంగాన్నీ సమీక్షించడానికి స్వయంగా ప్రజలకే పగ్గాలు అప్పజెప్పే అద్భుతమైన వ్యవస్థ ఈ లోకాయుక్త. ఇంకెందుకాలస్యం? కొరడా ఝుళిపించండి.