చిక్కుల్లో నటుడు సూర్య పింగ్ పంగ్... అమ్మాయి గొంతుతో జయరామ్‌కు ఫోన్!?
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ అలియాస్ ఎన్నారై జయరామ్ హత్య కేసులో టాలీవుడ్ నటుడు సూర్య పింగ్ పంగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా, అమ్మాయిల పిచ్చివుండే జయరామ్‌ను ఈ కేసులోని ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఇంటికి రప్పించేందుకు వీణ అనే అమ్మాయి పేరుతో మెసేజ్‌లు పంపించడమేకాకుండా, అమ్మాయి స్వరంతో నటుడు సూర్య మాట్లాడినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే సూర్యను జూబ్లీహిల్స్ పోలీసులు రెండురోజుల పాటు విచారించారు. ఈ విచారణ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు విచారణ కొనసాగింది. అనంతరం సూర్య మాట్లాడుతూ అందరిని పిలిచినట్లే తనను కూడా పిలిచి విచారించారని అన్నారు. తాను లేడీ వాయిస్‌తో మాట్లాడలేదని తెలిపారు. రాకేష్‌తో పరిచయం వాస్తవమే అని అయితే జయరాం హత్య కేసుతో తనకు సంబంధం లేదని సూర్య ప్రసాద్ స్పష్టంచేశారు.
మరోవైపు, జయరామ్‌ను హత్య చేయాలని నిర్ణయానికి వచ్చిన రాకేశ్ వారం ముందుగా నలుగురుకు సమాచారం చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు సూర్య ఉన్నాడని పోలీసులు తేల్చారు. హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఉన్న జయరామ్‌ను, వీణ అనే యువతి పేరిట ట్రాప్ చేసిన రాకేశ్, ఆమె మాట్లాడినట్టుగా ఓ యువతితో మాట్లాడించి, జయరామ్‌ను ఆహ్వానించాడని, కారును పంపుతున్నట్టు చెప్పగా, జయరామ్ వచ్చేందుకు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
దసపల్లా హోటల్‌కు కారు తీసుకువెళ్లిన సూర్య, తాను వీణా మేడమ్ డ్రైవర్‌నని, మిమ్మల్ని తీసుకురమ్మని పంపారని చెప్పి, జయరామ్‌ను రాకేశ్ ఇంటికి చేర్చాడు. ఆపై జయరామ్‌తో రూ.100 బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుని హత్య చేశారని తెలుస్తోందని చెప్పారు. హత్య జరిగే సమయంలో సీన్‌లో రౌడీషీటర్ నగేశ్, నగేష్ అల్లుడు విశాల్, రాకేష్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని తేలిందని, ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చనున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.