గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (19:19 IST)

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదానీ గ్రూపుపై విచారణ : రాహుల్ గాంధీ

rahul gandhi
వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూపు కంపెనీపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్వాయిస్‌లతో ప్రజలు విద్యుత్‌కు ఎక్కువ చెల్లించేలా చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలపై రూ.కోట్ల భారం పడుతుందని మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు. దీనిపై దర్యాప్తునకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. 
 
'ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్‌ బొగ్గు దిగుమతి చేసుకొంది. భారత్‌కు చేరేసరికి దాని ధర రెట్టింపు అవుతోంది. ఇలా అధిక ధరల కారణంగా సామాన్య ప్రజలు విద్యుత్‌ బిల్లులను భారీగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొన్ని కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాలు పేదలకు సబ్సిడీలు చెల్లించాల్సి వస్తోంది' అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 
 
ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దీనిపై దర్యాప్తు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాహుల్‌.. 'తాము అధికారంలోకి వస్తే తప్పుకుండా దర్యాప్తునకు ఆదేశిస్తాం' అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నరని ప్రశ్నించిన రాహుల్‌.. దర్యాప్తు జరిపి వారి విశ్వసనీయతను నిరూపించుకోవాలని అడుగుతున్నానన్నారు.