ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని ఐదేళ్ల తర్వాత కలుసుకున్నారు. పైగా, ఆయన తన స్వగ్రామానికి 28 యేళ్ల తర్వాత వెళ్లారు. దీంతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా, ఐదేళ్ళ తర్వాత తల్లిని కలుసుకున్న యోగి.. అమ్మ పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తల్లికి ఏ విధంగా దూరంగా ఉంటున్నారో అదే విధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన తల్లికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
దీంతో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగం ఉప్పొంగింది. ఈ అరుదైన దృశ్యం ఉత్తరఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో చోటుచేసుకుంది. పౌరీ జిల్లాలోని పంచూర్ సీఎం యోగి స్వగ్రామం. ఈ గ్రామానికి ఆయన 28 యేళ్ల తర్వాత వచ్చారు.