70 యేళ్లు అన్నపానీయాలు ముట్టని బాబా ఇకలేరు...!!
సాధారణంగా ఒక మనిషి మహా అయితే, వారం లేదా ఓ పది రోజుల పాటు అన్నపానీయాలు లేకుండ జీవిస్తాడు. లేదా ఓ పక్షం రోజుల పాటు ఉండగలడు. కానీ, ఆ బాబా మాత్రం ఏకంగా 70 యేళ్ల పాటు అన్నం, నీరు ముట్టుకోకుండా జీవించాడు. అందుకే ఆయన అంటే ఆ ప్రాంత వాసుల్లో అమితమైన భక్తి మర్యాదలు. అలాంటి బాబా ఇపుడు లేరు. కన్నుమూశారు.
ఆ బాబా పేరు యోగి ప్రహ్లాద్ జానీ. ఊరు గుజరాత్ రాష్ట్రం. బనస్కంత ఆశ్రమంలో ఆయన చనిపోయారు. చనిపోయన యోగికి ప్రస్తుతం 90 యేళ్లు. భక్తులు ఆయనను చునిర్వాలా మాతాజీ అని పిలుస్తారు. ఈయనలోని గొప్పదనం ఏమీ తినకుండానే జీవించడం. 70 ఏళ్ల పాటు అన్నం, నీళ్లు లేకుండా జీవించారు.
యోగి ప్రహ్లాద్‌పై గతంలో అనేక ప్రయోగాలు కూడా జరిగాయి. అన్నపానాదులు లేకుండా ఎలా బతుకుతున్నాడంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆయనను నిశితంగా పరిశీలించి ఏమీ తేల్చలేకపోయారు. ఏదో శారీరక అసాధారణత అని మాత్రం చెప్పగలిగారు.
2010లో యోగి ప్రహ్లాద్‌ను రెండు వారాల పాటు ఓ రూమ్‌లో ఉంచి వీడియో కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఆపై అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి తేల్చిందేమిటంటే... యోగి ప్రహ్లాద్‌కు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని జయించగల శక్తి ఉందని తేల్చారు.
అంతెందుకు, మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కూడా ఈ యోగి ఎలా బతుకుతున్నాడని ఎంతో ఆసక్తి చూపించినవాళ్లలో ఒకరు. యోగి మాత్రం తాను యోగధ్యానంతోనే జీవిస్తున్నానని సెలవిచ్చారు. అందుకే ఆయన జీవితం సైన్స్‌కు అందని మహాద్భుతంగా పేర్కొంటున్నారు.
ఇక, ప్రస్తుత విషయానికొస్తే, గురువారం నాడు బనస్కాంత ఆశ్రమంలోనే యోగి అంత్యక్రియలు జరగనున్నాయి. అప్పటివరకు భక్తుల సందర్శనార్థం ఆశ్రమంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు.