గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (16:15 IST)

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం ... పూణెలో కొత్తగా ఆరు కేసులు

Virus
మహారాష్ట్రలో జికా వైరస్ వెలుగు చూడటంతో కలకలం చెలరేగింది. ఈ రాష్ట్రంలోని పూణెలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కేసులు నమోదైన ఆరుగురిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉండటం గమనార్హం. ఈ వైరస్ సాధారణ పౌరుల కంటే గర్భవతులపై అధిక ప్రభావం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పూణెకు చెందిన ఓ వైద్యుడిలో తొలుత జికా వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత ఆయన టీనేజీ కుమార్తెకు ఈ వైరస్ సోకింది. తాజాగా ఆ వైద్యుడి కుటుంబానికి సమీపంలో నివసిస్తున్న ప్రాంతంలోనే రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఇద్దరి శాంపిల్స్‌ను పరీక్షించగా, జికా వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఇరంద్ వాణే ప్రాంతంలో ఆరోగ్య శాఖ సిబ్బంది విస్తృతంగా రక్త నమూనాలను సేకరిస్తుంది. 
 
జికా వైరస్ అనేది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని, ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ అల్బోపిక్టస్ రకాల దోమలు జికా వైరస్ వైరస్ వాహకాలుగా పని చేస్తాయి. జికా వైరస్ 1952లో తొలిసారిగా ఉగాండా దేశంలో గుర్తించిన విషయం తెల్సిందే. కాగా, ఈ వైరస్ గర్భవతులకు సోకితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. పుట్టే శిశువుపై ఈ వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుందని సాధారణం కంటే చాలా చిన్న తలతో శిశువులు జన్మిస్తుంటారని వివరించారు. శిశువుల్లో పుట్టుకతోనే ఇచ్చే ఇతర అసాధారణ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వైరస్ కలిగిస్తుందని తెలిపారు.