శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2020 (22:22 IST)

నాట్స్ వెబినార్ ద్వారా డ్యాన్స్ శిక్షణ, మానసిక ఆరోగ్యంపై అవగాహన

కరోనా కష్టకాలంలో ఆన్‌లైన్ ద్వారా తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా హ్యాపీ టూ త్రైవ్‌తో కలిసి రెండు చక్కటి కార్యక్రమాలు నిర్వహించింది. అందులో ఒక్కటి నృత్య శిక్షణ, రెండోది మానసిక ఆరోగ్యంపై అవగాహన.. ప్రముఖ యువనటుడు, కొరియోగ్రాఫర్ సాయి రొనక్‌‌చే సినిమా పాటలకు ఆన్‌లైన్ ద్వారానే డ్యాన్స్ నేర్పించే కార్యక్రమం నిర్వహించింది.
 
హ్యాపీ టూ త్రైవ్ సహా వ్యవస్థాపకులు ఈషా కోడె, సంజనా చేకూరి దీనిని సమన్వయం చేశారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది (ఫైనాన్స్ మార్కెటింగ్) దీనికి వ్యాఖ్యతగా వ్యవహారించారు. రెండు గంటల పాటు హిందీ, తెలుగు, మలయాళం హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పించే ప్రయత్నం చేశారు. దాదాపు 200 మంది ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ అయి.. తాము డ్యాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ పై మక్కువ చూపారు.
 
ఇక రెండవ కార్యక్రమం డాక్టర్ రోషన్ దాసరి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యంఇవ్వాలని ... మానసిక ఎంత దృఢంగా ఉంటే అంతగా మనకు వచ్చే సమస్యలనుఎదుర్కొనగలమని చెప్పారు. ఆర్థికపరమైన ఒత్తిడులను కూడా మానసిక స్థిరత్వంతో జయించవచ్చన్నారు. మానసిక ఆరోగ్యంపై అశ్రద్ధం ఏ మాత్రం తగదని హెచ్చరించారు. ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని రోషన్ దాసరి అన్నారు.
 
నాట్స్ టెంపాబే విభాగం నిర్వహించిన ఈ వెబినార్స్‌ పట్ల స్థానిక తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ఉపయుక్తమైన కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని వారు వెబినార్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
 
నాట్స్ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, రంజిత్, ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ఈకార్యక్రమాలను విజయవంతం చేసిన నాట్స్ టెంపా బే నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.