గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 సెప్టెంబరు 2017 (18:14 IST)

UAE జాగృతి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా(ఫోటోలు)

సెప్టెంబరు 22, 2017 శుక్రవారం రోజున ఉమల్ కోయిన్ లోని ఇండియన్ అసోషియేషన్ వేదికగా సుమారు 3000 మంది భారీ జనసందోహం నడుమ UAE జాగృతి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం( ETCA) ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 'బతుకమ్మ మరియు దసరా

సెప్టెంబరు 22, 2017 శుక్రవారం రోజున ఉమల్ కోయిన్ లోని ఇండియన్ అసోషియేషన్ వేదికగా సుమారు 3000 మంది భారీ జనసందోహం నడుమ UAE జాగృతి ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం( ETCA) ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 'బతుకమ్మ మరియు దసరా సంబరాలు' ఎంతో అట్టహాసంగా జరిగాయి. 
 
ఈ విశేషమైన వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ పార్లమెంటు సభ్యులు అయిన జి.వివేకానంద్ మరియు ఆయన సతీమణి, విసాక ఇండస్ట్రీస్ ఎండీ జి.సరోజ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ హాజరు కాగా కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్‌గా 'స్వరాంజలి' ఫేమ్ శ్రీమతి కవిత చక్ర నిలిచారు. స్థానిక ప్రముఖులు మరియు పలు సంఘాల ప్రతినిథులు పాల్గొన్నారు. 
 
ముందుగా కళాకారుల డప్పు వాయిద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొని తదనంతరం మహిళా అతిథులు మరియు ETCA మహిళా సభ్యులందరూ కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కావడం మరియు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి,పాడటంతో వేదిక అంతా గొప్ప పండగ వాతావరణంతో నిండి పోయింది.
 
అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథులు అయిన శ్రీ వివేకానంద్ గారు మాట్లాడుతూ, భారీ ఎత్తున నిర్వహించబడిన సంబరాలు చూసి ETCA వారి కృషిని ఎంతగానో కొనియాడారు. శ్రీమతి సరోజ మహిళలందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. నైనా జైస్వాల్ మాట్లాడుతూ ఖండాంతరాల్లో ఉండి కూడా తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. గాయని శ్రీమతి కవిత చక్ర చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమానికి వన్నె తెచ్చారు.
 
ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పువ్వులతో పేర్చి తీసుకొచ్చిన వివిధ రకాల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. నిర్వాహకులు అందమైన బతుకమ్మలను ఎన్నుకొని బహుమతులు ప్రదానం చేశారు. అంతేకాకుండా బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ETCA మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదాన్ని అందజేయడం జరిగింది.
 
ఈ వేడుకకు ఖజానా జ్యుయలర్స్ ప్రధాన స్పాన్సర్ కాగా, LSPMK, SRR బిల్డింగ్ మెటీరియల్స్, మహశ్వేత ఫుడ్స్ మరియు రియల్ టేస్ట్ రెస్టారెంట్ వారు ఇతర స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఈ సంబరాల్లో UAE జాగృతి అధ్యక్షులు, ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్టు కృషి చేయగా మంచుకొండ వెంకటేశ్వర్లు, రాధారపు సత్యం మరియు ఇతర సభ్యులు తగు విధాలుగా తమవంతు సహాయ సహకారాలను అందించారు.