మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (14:20 IST)

శాక్రమెంటో తెలుగు సంఘం “అమ్మా, నాన్న, షావుకారు జానకితో మాటామంతి”(వీడియో)

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోంలో శనివారం జులై 16, 2017న శాక్రమెంటో తెలుగు సంఘం నిర్వహించిన “అమ్మా, నాన్న, షావుకారు జానకితో మాటామంతి” కార్యక్రమానికి విశేష స్ప

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో శివారు నగరం ఫాల్సోంలో శనివారం జులై 16, 2017న శాక్రమెంటో తెలుగు సంఘం నిర్వహించిన “అమ్మా, నాన్న, షావుకారు జానకితో మాటామంతి” కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 69 సంవత్సరాలు సినిమా ప్రయాణంతో ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి షావుకారు జానకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
 
1949లో విడుదలయిన షావుకారు చిత్రంలో "పలుక రాదటే చిలుకా సముఖములో రాయబారమెందులకే" అంటూ  ఘంటసాల పాడిన పాటను స్థానిక అభినవ ఘంటసాల "రాజు ఈడూరి" ఆలపించినప్పుడు షావుకారు జానకి ఆయనతో స్వరం కలపడం ఈ కార్యక్రమంలో ఒక మధుర ఘట్టంగా మిగిలిపోయింది. "పాండవులు పాండవులు తుమ్మెదా" అంటూ స్థానిక ఆడపడుచులతో షావుకారు జానకి వేదికపై పాదం కదిపారు. 
 
స్థానిక సంగీతాంజలి సంగీత కళాశాలకు చెందిన చిన్నారులు ఆలపించిన ప్రార్ధనా గీతం అనంతరం కళాశ్రయ డ్యాన్స్ స్కూల్‌కు చెందిన చిన్నారులు చేసిన భరత నాట్య ప్రదర్శనలతో షావుకారు జానకి పరిచయ కార్యక్రమంతో మొదలయ్యింది. స్థానిక గాయకులు "అభినవ ఘంటసాల" రాజు ఈడూరి, దివాకర్ సోమంచి, రజని దాస్యం ఈ కార్యక్రమంలో అలనాటి పాత పాటలు పాడి తెలుగు సీనియర్ సిటిజన్స్‌ను అలరించారు.
 
అనంతరం షావుకారు జానకి మాట్లాడుతూ తమ రోజుల్లో ఇంటర్నెట్ లేదని, కానీ ఇన్నర్నెట్ మాత్రం ఉందని చెప్పారు. స్థానిక ఫాల్సంలో ఉన్న మనబడి స్కూల్‌లో పిల్లలు తెలుగు నేర్చుకోవడం తనకు ఆనందాన్ని కలిగించిందని ఆమె చెప్పారు. పుట్టపర్తి సాయిబాబాతో తనకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఆమె వివరించారు. ప్రస్తుతం బెంగుళూరులో చెల్లెలు కృష్ణకుమారితో ఉంటున్న తాను స్థానిక తెలుగువారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమెరికాలో ఇంతకి స్థాయిలో స్వాగత సత్కారాలను తాను ఊహించలేదని ఆమె చెప్పారు. 
 
ఆహుతులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొంటూ, ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని, తాను వయసుపరంగా వృద్ధురాలినే కానీ, మనసుపరంగా ఇంకా యువతినేనని నటి షావుకారు జానకి నిరూపించారు. అనంతరం షావుకారు జానకికి "లైఫ్ టైం ఎచీవ్‌మెంట్" అవార్డును శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు అందజేసి, ఆమెను ఘనంగా సత్కరించారు. షావుకారు జానకిని ప్రత్యక్షంగా చూడటం, ఆమెతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం తమకు మధురానుభూతిని కలిగించిందని పలువురు తెలుగు సీనియర్ సిటిజన్స్ చెప్పారు.
 
ఈ సందర్భంగా స్థానిక ఫాల్సం నగరంలో సిలికానాంధ్ర మనబడి తెలుగు తరగతుల జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న 87 మంది పిల్లల నుండి 100 మందికి పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వివరించారు. అనంతరం వీర్రాజు విన్నకోట ఆధ్యాత్మిక ప్రసంగంతో అందరినీ అలరించారు. తదుపరి అమెరికాకు విచ్చేసిన తెలుగు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో భాగంగా గుండెపోటు, స్ట్రోక్‌లపై డా.రాధిక బుక్కపట్నం చక్కని అవగాహన ప్రసంగం చేశారు. గుండె సంరక్షణ, గుండెపోటు, స్ట్రోక్ లక్షణాలు గురించి వివరించి, మొదటి అరగంటలో కనుక స్పందిస్తే పలు కేసుల్లో కోలుకోవడం సాధ్యమవుతుందని ఆమె తెలుగు సీనియర్ సిటిజన్స్‌కు పలు సూచనలు చేసారు.
 
ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీలో తెలుగు సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో గెలిచినవారు షావుకారు జానకి చేతుల మీదుగా శాక్రమెంటో తెలుగు సంఘం ట్రోఫీలను అందుకున్నారు. తొమ్మిది ఏండ్ల నుండి శాక్రమెంటో తెలుగు సంఘం కొనసాగిన్తున్న “అమ్మా, నాన్న” కార్యక్రమాన్ని పలువురు తెలుగు సీనియర్ సిటిజన్స్ ప్రశంసించారు. 
 
తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నివాసముండే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 2003‌లో శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) స్థాపించడం జరిగిందని ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగిందని వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో “అమ్మా, నాన్న, షావుకారు జానకితో మాటామంతి” కార్యక్రమం  విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు: మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి, డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు శాక్రమెంటో తెలుగు సంఘం  కార్యకర్తలు పాల్గోన్నారు. 
 
స్థానిక రుచి ఇండియన్ రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన తెలుగు విందు భోజనం అందరినీ అలరించింది. “అమ్మా, నాన్న, షావుకారు జానకితో మాటామంతి”  ఫోటోలను ఫేస్ బుక్ facebook.com/SacTelugu/photos_streamలో లేదా goo.gl/P2NJGVలో చూడవచ్చునని వారు తెలిపారు. ఫణి డోగిపర్తి ఫోటోగ్రఫీ సహకారం అందించారు. సోమవారం జులై 24 సాయంత్రం 6:30 గం. కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం స్థానిక రాంచో కార్డోవాలో ఉన్న సాయి సేవా సదన్ మందిరంలో ఏర్పాటు చెయ్యడం జరిగిందని, స్థానిక తెలుగువారు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శాక్రమెంటో తెలుగు సంఘం కార్యనిర్వాహక సభ్యులు విజ్ఞప్తి చేశారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యదర్శి మోహన్ కాట్రగడ్డ చేసిన వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శాక్రమెంటో తెలుగు సంఘం చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు sactelugu.org, facebook.com/SacTeluguను సందర్శించాలని లేదా [email protected]కు ఈమెయిలులో సంప్రదించాలని శాక్రమెంటో తెలుగు సంఘం కార్యనిర్వాహక సభ్యులు కోరారు. వీడియో చూడండి.