1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (17:25 IST)

నేడు చంద్రగ్రహణం... ఏ రాశి వారికి ఏంటి...? పాటించాల్సిన నియమాలు...

చైత్ర శుక్ల పూర్ణిమ శనివారము నాడు అంటే, 4 ఏప్రిల్‌ 2015న హస్త నక్షత్రంలో కన్యరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించనుంది. చైత్ర పూర్ణిమ నాడు చంద్రగ్రహణం కావడంతోనూ ఈరోజు శనివారం అవడంతోనూ అది అలభ్యయోగం’’. ఈ గ్రహణ కాలంలో చేసే దానము మరియు జపం వల్ల అశ్వమేధ ఫలం వస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. కాగా గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం 03.45 సూర్యాస్తమయం.... హైదరాబాదు కాలమానం ప్రకారం సాయంత్రం 06.26. మోక్ష కాలం రాత్రి 07.17. ఐతే గ్రహణం మధ్యాహ్నం 03.45 నుండి ప్రారంభమైనప్పటికీ పగటికాలంలో ఎక్కువ ఉండటం వల్ల సాయంత్రం 06.26 నుండి లెక్కలోకి తీసుకుంటారని చెపుతున్నారు. 

 
ముఖ్యంగా గ్రహణ గోచారము హస్త నక్షత్రం వారు, అధమ ఫలితం పొందేవారును ఈ గ్రహణమును చూడరాదు. అలాగే ఈ గ్రహణం కారణంగా మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశుల వారికి శుభ ఫలితం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు. ఇంకా వృషభ, తుల, మకర, మీన రాశుల వారికి మధ్యమ ఫలం చేకూరుతుంది. ఇకపోతే మేష, సింహ, కన్య, ధను రాశులకు చెందినవారికి అధమ ఫలంగా ఉంటుందంటున్నారు.
 
పాటించవలసిన నియమాలు 
గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
 
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.