పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?
కాపు ఉద్యమ నాయకుడు అని పేరున్న ముద్రగడ పద్మనాభం అకస్మాత్తుగా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరిన తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన గురిపెట్టారు. పిఠాపురంలో ఆయనను ఓడించి తీరుతామని ప్రకటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేస్తారా? తన్ని తరిమేయడానికి సిద్ధంగా వున్నారంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు.
ముద్రగడ పద్మనాభం చేసిన ప్రతిజ్ఞపై జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం అని చెప్పుకునేకంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరే మీకు బాగుంటుందనీ, కాపులకు అన్యాయం చేసిన వారికి వెన్నుదన్నుగా నిలిచిన మీకు పద్మనాభ రెడ్డి పేరు సరిపోతుందంటూ చెపుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారనీ, ప్రజలంతా పవన్ కల్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని అంటున్నారు.