సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (20:51 IST)

మార్చి 29న దుర్గాష్టమి: గులాబీ రంగు దుస్తులు.. తామర పువ్వులను..?

Durga Matha
చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు త్వరలో ముగియనున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం చూస్తుంటాం. తొమ్మిది రూపాల్లో దుర్గను పూజిస్తారు. జాగరణ, ఉపవాసం, పూజ ఈ నవరాత్రుల్లో చోటు సంపాదించుకుంటాయి. ఈ ఏడాది చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై.. మార్చి 30వ తేదీన ముగియనున్నాయి. ఇందులో దుర్గాష్టమిని మార్చి 29న జరుపుకోనున్నారు.
 
అష్టమి తిథి మార్చి 28 రాత్రి 07.04 గంటలకు ప్రారంభమై.. మార్చి 29 రాత్రి 9 గంటలా 9 నిమిషాలకు ముగుస్తుంది. అష్టమి రోజున శుభ ముహూర్తం ఉదయం 06.15 గంటల నుంచి 07.48 గంటలకు, అలాగే ఉదయం 07.48 గంటల నుంచి ఉదయం 09.20 గంటల వరకు, అలాగే ఉదయం 10.53 గంటల నుంచి మధ్యాహ్నం 12.26 గంటల వరకు వుంటుంది. ఈ రోజున దుర్గమ్మను పూజించడం ద్వారా సర్వ సుభాలు చేకూరుతాయి. 
 
అనుకున్న కార్యంలో విజయం కోసం బుధవారం పూట వచ్చే ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారికి అభిషేక, ఆరాధనలు చేయడం మంచిది. ఈ రోజున గులాబీ రంగు దుస్తులను ధరించడం మంచిది. అలాగే అమ్మవారికి తామరపువ్వులను సమర్పించడం ద్వారా సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. 
 
ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. హల్వా, పూరీ, చన్నా, కొబ్బరిని తీసుకోవచ్చు. నేతితో చేసిన వంటకాలను తీసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం నేతి ఫలహారాలు తామరపువ్వుల మాలను సమర్పించవచ్చు. అలాగే 4-12 ఏళ్ల లోపు గల బాలికలను ఇంటికి ఆహ్వానించి.. వారికి పాదపూజ చేసి తిలకాన్ని అందజేయాలి. వారికి తీపి పదార్థాలను అందజేయవచ్చు. అలాగే పేదలకు అన్నదానం చేయవచ్చు. పండ్లు, దుస్తులను దానంగానూ ఇవ్వడం చేయవచ్చు. దుర్గామాతకు సంబంధించిన మంత్రాలను పఠించవచ్చు.