బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Modified: బుధవారం, 29 మార్చి 2017 (16:10 IST)

మిథునరాశి ఫలితాలు... మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు

మిథున రాశివారికి జూన్ వరకు సప్తమము నందు శని, తదుపరి వక్రగతిన షష్ఠమము నందు, అక్టోబర్ నుండి తిరిగి సప్తమము నందు, ఆగష్టు వరకు తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు రాహువు, అష్టమము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు చత

మిథునరాశి : మృగశిర-3, 4 పాదములు, ఆరుద్ర-1, 2, 3, 4, పునర్వసు-1, 2, 3, 4
ఆదాయం -2 వ్యయం -11 పూజ్యత -2 అవమానం-4
 
మిథున రాశివారికి జూన్ వరకు సప్తమము నందు శని, తదుపరి వక్రగతిన షష్ఠమము నందు, అక్టోబర్ నుండి తిరిగి సప్తమము నందు, ఆగష్టు వరకు తృతీయము నందు రాహువు, భాగ్యము నందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు రాహువు, అష్టమము నందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు చతుర్థము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా పంచమము నందు సంచరిస్తాడు.
 
మీ గోచారం పరీక్షించగా ''జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః, జిహ్వాగ్రే మిత్ర బాంధవా''అన్నట్లుగా మంచి మాట సంపదను, బంధుమిత్రులను ఇస్తుంది అన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. వాక్‌స్థానము నందు రాహు సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాలు, హడావుడి పడి సంభాషించడం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. కొత్త కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తారు. పాతవ్యవహారాలు ఒక కొలిక్కి తేగలుగుతారు. ఆర్థిక ఒడిదుడుకులు కొంత ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ గురుదోషం ఉన్నందువల్ల విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గటం, చంచలత్వం, చికాకు, ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
నిర్మాణ రంగాల్లో వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అవాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. రాజకీయాల్లో వారు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. న్యాయపరమైన విషయాల్లో ముఖ్యుల సలహా పొందుతారు. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనం ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు, అధికారులకు సమన్వయం లోపించవచ్చు. వాణిజ్య రంగాల్లో వారు సదవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగాల్లో వారికి అనుకున్నంత ఫలితం కానరాకపోవచ్చు. 
 
ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఫైనాన్స్, బ్యాంకింగ్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగుల యత్నాలు సఫలం కాగలవు. హోటల్, తినుబండ వ్యాపారలస్తులకు కలిసిరాగలదు. క్రీడారంగాల్లో వారికి అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబీకుల మధ్య అవగాహన పెంపొందుతుంది. 
 
దూరప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామిక వ్యవహారాల్లో మెళకువ అవసరం. పరిచయం లేని వ్యక్తులతో మితంగా వ్యవహరించడం మంచిది. విదేశీయాన ప్రయత్నాల్లో సఫలీకృతులు కాగలరు. ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. వైద్య రంగాల్లో వారికి అనుకోని పురోభివృద్ధి కానరాగలదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనిస్తారు. 
 
* విద్యార్థులు శారదా దేవిని ఆరాధించడం వల్ల స్థిరబుద్ధి విద్యాబుద్ధి చేకూరగలదు. 
* మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడినట్లైతే మీకు అభివృద్ధి కానవస్తుంది. 
* మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్రగోమేధికం, పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేక వైక్రాంతమణి అనే రాయిని ధరించినట్లైతే శుభం కలుగుతుంది.