గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : గురువారం, 3 మే 2018 (13:28 IST)

మహాలక్ష్మి మా ఇంట్లో వుండటంలేదని అనుకుంటారు... కారణం ఏమిటంటే?

యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః జీవిత లక్ష్యం సాధించాలంటే శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం ఉండాలి. సిరుల తల్లిగా, వరాల కల్పవల్లిగా భక్తకోటి పూజలందుకుంటుంది మహాలక్

యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
 
జీవిత లక్ష్యం సాధించాలంటే శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం ఉండాలి. సిరుల తల్లిగా, వరాల కల్పవల్లిగా భక్తకోటి పూజలందుకుంటుంది మహాలక్ష్మీ. తనను చేరి కొలచేవారికి సకల సంపదలనూ అనుగ్రహిస్తుందీ అమ్మ. ఎన్ని మంత్రాలు జపించినా, మరెన్ని హోమాలు చేసినా, ఎక్కడెక్కడి ఆలయంలో దర్శించినా లక్ష్మీ తమ దగ్గర నిలకడగా ఉండడంలేదని అంటుంటారు. దానికి కారణం లక్ష్మీ తత్త్వాన్ని అవగతం చేసుకోకపోవడమే. శుద్ద సత్వ స్వరూపిణి అయిన ఆ అమ్మ తన తత్త్వానికి తగ్గట్టుగా కొన్నికొన్ని చోట్ల మాత్రమే స్థిరంగా ఉంటుంది. 
 
మహాభారత శాంతి పర్వంలో శ్రీసం విధానం అనే అధ్యాయంలో లక్ష్మీదేవి స్వయంగా తాను ఎక్కడ ఉండేది వివరించింది. సత్యం, దానం, వ్రతం, తపస్సు, పరాక్రమం, ధర్మం అనే వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఒకప్పుడు బలి చక్రవర్తి సింహాసనాన్ని పొందాడు. అప్పుడా చక్రవర్తి సత్యవాదిగా, జితేంద్రియుడిగా నిత్యం యాగాలు చేసేవాడుగా ఉండేవాడు.
 
సింహాసనాన్ని ఎక్కిన తరువాత అవన్నీ మానేసి చివరకు తన పేరు మీదనే అందరూ యాగాలు చేయాలని ఆదేశించాడు. అందుకే బలి చక్రవర్తిని విడిచి వెళ్లిపోతునట్టు లక్ష్మీదేవి చెప్పింది. ఒకసారి రుక్మిణి.... లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉండడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవాలని ఆ విషయాన్ని లక్ష్మీదేవినే అడిగింది. శుభాన్ని కోరేవారు, కార్యదక్షత కలగినవారు, శాంతం, దైవభక్తి, ఇంద్రియ నిగ్రహం, కృతజ్ఞత కలిగిన మనుషులున్న ఇళ్లలో మాత్రమే ఉంటానని స్పష్టం చేసింది. 
 
స్త్రీల విషయానికొస్తే... అనవసరంగా పొరుగిళ్లకు పోయి కాలం వృధా చేసేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, తగాదలను ఇష్టపడేవారు.... తనకు నచ్చరని వివరించింది. సృష్టి ఆరంభంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ రాస మండలంలో ఉన్నప్పుడు ఆయన ఎడమ భాగం నుండి ఓ స్త్రీ మూర్తి ఆవిర్భవించింది. పరబ్రహ్మ సంకల్పంతోనే ఆ మూర్తి రెండు రూపాలను పొందింది. ఒక మూర్తి మహాలక్ష్మిగా, మరో మూర్తి రాధగా అవతరించారు. రాధ శ్రీకృష్ణ పరమాత్ముని చేరింది. మహాలక్ష్మి వైకుంఠంలో చతుర్భుజాలతో ఉన్న శ్రీమహావిష్ణువు వద్దకు చేరింది. అక్కడ నుండి సృష్టి అంతా వ్యాపించింది.