పంచారామాలలో కుమారరామం గురించి తెలుసా?

సందీప్| Last Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:41 IST)
పంచారామాలలో కుమారారామం ఒకటి. రాజమండ్రికి 47 కిమీ దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా, రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంచరామాల్లో చివరిదైన కుమార భీమారామము ఉంది. ఇక్కడ స్వామివారిని కాలభైరవుడని పిలుస్తారు.


తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఆయన ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. 
 
ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. 11 వ శతాబ్దంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆలయంలోని శివుడిని కుమార భీమేశ్వరుడు అని అంటారు.

అమ్మవారి పేరు బాలాత్రిపురా సుందరి. క్షేత్ర పాలకుడు మాండవ్య నారాయణుడు. రెండు అంతస్థులు కలిగిన ఈ ఆలయంలో శివలింగం మీద చైత్ర, వైశాఖ మాసాల్లో ఉభయ సంధ్యల్లో సూర్య కిరణాలు నేరుగా పడడం విశేషం. 
 
ఈ ఆవరణంలోని భీమగుండంలో స్నానం చేస్తే పాపహరణమే కాకుండా, అభీష్ట సిద్ధులు కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్థల పురాణం ప్రకారం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడిని వధించిన అనంతరం రాక్షసుని కంఠంలోని ఆత్మ లింగం ఐదు ప్రదేశాలలో పడగా అవే పంచారామ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.

అమరావతిలోని అమరేశ్వరాలయం, ద్రాక్షారామంలోని శివక్షేత్రం, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని ఈ కుమారారామం. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్ని కూడా నిర్మించాడు. 
 
అందువలనే ఈ రెండు గుళ్లు ఒకే రీతిలో ఉంటాయి. వినియోగించిన రాయి కూడా ఏక రీతిలో ఉంటుంది. నిర్మాణ శైలి కూడా అదే విధంగా ఉంటుంది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యాన్ని పాలించిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. 
 
వారి శిల్ప కళల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా కనుగొనవచ్చు. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. సున్నపు రాయిచే నిర్మితమై శివలింగ ఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. 
 
గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం కనువిందు చేస్తుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది.

స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు ఆశీనుడై ఉన్నాడు. ఇది ఏకశిల. ప్రధానాలయానికి పశ్చిమ దిశలో నూరుస్తంభాల మండపం ఉంది. వీటిల్లో ఏ రెండు స్తంభాలూ ఒకే పోలికతో ఉండవు. ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఇది నిదర్శనం.దీనిపై మరింత చదవండి :