గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సారె మహోత్సవం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరివున్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస పవిత్ర సారె మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని కుటుంబ సభ్యులతో కలిసి దుర్గగుడి అర్చకులు, వైదిక కమిటీ, వేద పండితులు సమర్పించారు. 
 
ఆషాఢ మాసం సారె మహోత్సవం తొలి రోజైన ఆదివారం అమ్మవారికి ఆలయ అర్చకులు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు సమర్పించిన పవిత్ర సారెను తొలుత‌ దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు కలిసి అమ్మవారికి రూ.3.30 లక్షలతో అమ్మవారికి మయూరి హారాన్ని సమర్పించారు. 
 
ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢ సారెను సమర్పించే భక్తులు, ధార్మిక సంస్థలు మూడు రోజులు మందుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలని కోరారు. ఆఫీసు వేళల్లో దేవస్థానం ఫోను నెంబర్లు 9493545253, 8341547300ల‌కు ఫోను చేసి ఎక్కడి నుంచి సారెను తీసుకువస్తున్నారు, భక్తుల సంఖ్య, ఏ తేదీ సమర్పించేది త‌దిత‌ర వివరాలను ముందుగా నముదు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించి దేవస్థానం అధికారులకు సహకరించాలని కోరారు.