శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (16:43 IST)

శ్రీవారి అర్జిత సేవలకు కోవిడ్ రిపోర్టు తప్పనిసరి : తితిదే ఈవో

దేశంలోనే కరోనా వైరస్ భయం ఇంకా పూర్తిగా వీడిపోలేదు. ఇటీవలి కాలంలో నమోదవుతున్న కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి సేవలకు హాజరుకావాలనుకునే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇకపై శ్రీవారి అర్జిత సేవల్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టును తితిదే తప్పనిసరిచేసింది. 
 
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం 'డయల్‌ యువర్‌ ఈవో' కార్యక్రమం అనంత‌రం జవహర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు సేవకు 72 గంట‌ల ముందు కొవిడ్ ప‌రీక్ష చేయించుకుని స‌ర్టిఫికెట్ తీసుకువ‌స్తేనే అనుమ‌తిస్తామన్నారు. 
 
కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. భ‌విష్యత్‌ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అలిపిరిలో రెండు చోట్ల  రెండువేల వాహ‌నాలు, తిరుమ‌ల‌లో రెండు చోట్ల 1,500 వాహ‌నాలు పార్క్ చేసేలా మ‌ల్టీలెవ‌ల్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో చెప్పారు. 
 
తితిదే క‌ల్యాణ మండ‌పాల లీజు కాలాన్ని 3 నుంచి 5 ఏళ్లకు, ఆ త‌ర్వాత మ‌రో రెండేళ్లు పొడిగించేలా విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ కోసం గ్రీన్ ఎన‌ర్జీ త‌యారు చేసే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయన్నారు. 
 
భ‌విష్యత్తులో విద్యుత్‌తో న‌డిచే వాహ‌నాల‌ను మాత్రమే తిరుమ‌ల‌కు అనుమ‌తించే విధంగా ఆలోచ‌న చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా 150 విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఆర్టీసీ ప్రయ‌త్నాలు ప్రారంభించిందన్నారు. తితిదే అధికారులకు కూడా విద్యుత్‌తో న‌డిచే వాహ‌నాల‌ను కేటాయిస్తామన్నారు.