టిటిడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి నియామకం...
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈయన ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత నమ్మకస్తుడు కావడం గమనార్హం.
తితిదే ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఆయనను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా ఏపీ సర్కారు బదిలీ చేసి, తాత్కాలిక ఈవోగా జేఈవో ధర్మారెడ్డిని నియమించింది. అయితే, సీఎం జగన్ సర్కారు కొత్తగా పూర్తి స్థాయి ఈవోను నియమింది.
ఈ నెల 23వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నందుకు జవహర్ రెడ్డిని పూర్తి స్థాయి ఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలా సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం జవహర్ రెడ్డి ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.