శ్రీవారి భక్తులకు శుభవార్త - 12 నుంచి జ్యేష్టాభిషేకం టిక్కెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవలో పాలుపంచుకునేందుకు రోజుకు 600 మంది చొప్పున అనుమతించనున్నారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు రూ.400 ధరతో ఉన్న టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సివుంది.
ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఒక రోజు ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివుంటుంది. రోజుకు 600 టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ టిక్కెట్లను తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లలోనే విక్రయిస్తారు. 12వ తేదీ జ్యేష్టాభిషేకంలో పాల్గొనేవారు 11వ తేదీన ఈ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.