పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన: వర్చువల్ సేవలో పాల్గొన్న గృహస్తులు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ సేవలో వర్చువల్ విధానం ద్వారా 413 మంది గృహస్తులు తమ ఇళ్ల నుండే పాల్గొన్నారు.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల ముందురోజు లక్షకుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
కాగా, హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.
మంగళవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. ఆలయంలో నవంబరు 30న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుండి 10 గంటల నడుమ ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.