1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (13:19 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం శుక్రవారం ముగియడంతో ఉదయం నుంచి సుప్రభాత సేవను టిటిడి పునఃప్రారంభించింది. గత యేడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

 
అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో జనవరి 15వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను నిర్వహించారు. ఇక యధావిధిగా సుప్రభాతసేవను కొనసాగించనున్నరు. 

 
ఇదిలా ఉంటే కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జనవరి 16వ తేదీన ఆదివారం శ్రీవారి ఆలయంలో ఏకాంతంలో పార్వేటి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీవారి పార్వేటి ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజును జరుపుకుంటారు.

 
ఈ ఉత్సవంలో శ్రీ మలయప్పస్వామి అడవులకు వెళ్ళి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడుతారు. ప్రతియేడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా గత సంవత్సరం కళ్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

 
కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గత యేడాది నిర్వహించిన విధంగానే ఏకాంతంగానే ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. అదేవిధంగా జనవరి 17వ తేదీన తిరుమలలో నిర్వహించే శ్రీరామక్రిష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.