శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి ఆలయం తెప్పోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు, అమ్మవారితో కలిసి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. 
 
ఇందులో భాగంగా మొదటిరోజు తిరుపతిలోని శ్రీ కోందరామస్వామివారి ఆలయం నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణి చేరుకున్నారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. 
 
అదేవిధంగా ఆదివారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.  ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు  రాజేంద్రుడు, పార్వతి, ఏఈవో  రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్  రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కామరాజు, మునీంద్రబాబు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.