శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (21:04 IST)

అయ్యప్ప యాత్రకు కేరళ సర్కారు సమ్మతం!!

ప్రతి యేడాది జరిగే శబరిమల అయ్యప్ప యాత్రకు కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నిబంధలకు లోబడే ఈ యాత్ర కొనసాగుతుందని కేరళ రాష్ట్ర దేవాదాయ మంత్రిత్వ శాఖ సురేంద్రన్ వెల్లడించారు. 
 
ప్రతి యేడాది శబరిమల యాత్ర నవంబరు నెలలో ప్రారంభమవుతుంది. ఈ యేడాది నవంబరు 16వ తేదీన ప్రారంభంకానుంది. అయితే, ఈ యాత్రకు వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే ధృవపత్రాన్ని చూపించాల్సివుంటుంది. 
 
ఐసీఎమ్మార్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల‌లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిట‌ళ్ల‌లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. 
 
పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణల్లో భాగంగా హెలిక్యాప్ట‌ర్‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.
 
కాగా, ప్రతి యేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు అనుమతిచ్చినప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యాత్రను మధ్యలోనే నిలిపివేసిన విషయంతెల్సిందే.