శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (17:19 IST)

ఎంతకీ పెళ్లి కావడంలేదా? అక్కడికెళ్తే ఖాయం... 360 రోజులు 360 మందిని...

మహావిష్ణువు యొక్క 108 దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిడందై ప్రాంతంలో ఉంది. ఇందులో మహా విష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్‌గా, లక్ష్మీదేవి కోమలవల్లిగా పూజలందుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన అనతికాలంలోనే తప్పకుండా వివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది.
 
స్థల పురాణం ప్రకారం.. త్రేతా యుగంలో మేఘనాథుడి కుమారుడు బాలి తన రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తూ ఉన్నప్పుడు, మాలి, మాల్యవన్, సుమాలి అనే రాక్షసులు దేవతలపై యుద్ధం చేయడంలో సహాయం కోరి అతని వద్దకు రాగా, సహాయాన్ని నిరాకరిస్తాడు. దీంతో రాక్షసులు ఓడిపోతారు. మళ్లీ యుద్ధం చేయడం కోసం రాక్షసులు బాలిని సహాయం అడగగా ఈసారి సహాయం చేయడానికి ఒప్పుకుని యుద్ధంలో రాక్షసులను గెలిపిస్తాడు, కానీ బ్రహ్మహత్యా దోషాన్ని మూటగట్టుకుంటాడు. ఆ దోష నివారణకై బాలి ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా, మహా విష్ణువు మెచ్చి వరాహ రూపంలో దర్శనమిస్తాడు.
 
మహర్షి కుని, తన కుమార్తెతో సహా స్వర్గానికి చేరుకోవాలనే కోరికతో నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ కునికి మాత్రమే స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది, ఆమె కుమార్తె వెళ్లలేకపోతుంది. నారద మహర్షి ఆ యువతి దగ్గరికి వచ్చి నీకు ఇంకా పెళ్లి కానందున ఇలా జరిగిందని చెప్పగా, తనను వివాహమాడమని వేరే మునులను కోరుతుంది. ఒక కలవ మహర్షిని పెళ్లాడి, 360 మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. 
 
తన కుమార్తెలను వివాహమాడమని ప్రార్థిస్తూ కలవ మహర్షి నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ నారాయణుడు ప్రత్యక్షం కాడు. ఒకరోజు దివ్యదేశ యాత్ర చేస్తున్నాని చెప్పి వారి వద్దకు ఒక యువకుడు వస్తాడు. అతను నారాయణుడంత అందంగా కనిపించడంతో ముగ్ధుడైన కలవ మహర్షి తన కుమార్తెలను పెళ్లి చేసుకోమని కోరతాడు. ఆ యువకుడు అంగీకరించి రోజుకు ఒకరిని చొప్పున 360 రోజుల పాటు 360 మందిని పెళ్లి చేసుకుంటాడు. చివరి రోజున, తాను మరెవరో కాదు వరాహ రూపంలో ఉన్న నారాయణుడని నిజం చెప్పి, 360 మంది భార్యలను కలిపి ఒక స్త్రీమూర్తిగా చేసి తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుంటాడు.
 
ఏడాదిలో అన్నిరోజులు వివాహం జరిగినందున ఈయనకు నిత్య కళ్యాణ పెరుమాళ్ అనే పేరు వచ్చింది. పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులు ఇక్కడ కొలువై ఉన్న కోమలవల్లి అమ్మవారిని దర్శించుకుని, ప్రార్థిస్తే వెంటనే వివాహం నిశ్చయమవుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజలలో ఎక్కువగా ఉండటంతో ఎప్పుడూ ఈ దేవాలయం యువతులతో కళకళలాడుతుంటుంది. ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై నుండి ఈసిఆర్, మహాబలిపురం వెళ్లే బస్సులన్నీ తిరువిడందై మీదుగా వెళ్తాయి.