శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (14:00 IST)

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం...

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహమూర్తికి సమర్పించి తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు సమర్పిస్తారు? ఒకరోజు శ్రీ వరాహస్వామి వేంకటాచలంలో తిరుగుతున్న శ్రీనివాసుని చూసి నీవెవరవు .... అని ప్రశ్నించాడు. దానికి శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఇచ్చటనే నివసించాలని నా సంకల్పం. దానికి నాకు స్థలం కావాలి అన్నాడు. దానికి వరాహస్వామి మూల్యమిచ్చి స్థలాన్ని తీసుకోమన్నాడు. 
 
అప్పుడు శ్రీనివాసుడు నా వద్ద ధనం లేదు. నీవు నాకు స్థలం ఇస్తే నీకు ధనానికి బదులుగా నీకు ప్రధమ దర్శనం, ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం చెందేట్లుగా చేస్తానన్నారు శ్రీనివాసుడు. దీనికి అంగీకరించిన శ్రీ వరాహస్వామి  శ్రీ వేంకటాచలపతియైన శ్రీనివాసుడు శతపాదపరిమితమగు స్థలాన్ని ఇచ్చాడు.
 
ఆనాడు శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన మాట ప్రకారం నేటికి భక్తులు, బంగారు పుష్కరిణి వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరాహస్వామిని ప్రధమంగా దర్శించుకున్న తరువాతనే కల్యాణ చక్రవర్తి అయిన శ్రీ వేంకటేశ్వరుని దర్శిస్తున్నారు. శ్రీనివాసునికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహస్వామికి సమర్పించి తరువాతనే వేంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నారు.
 
ఏకరూపులు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపులైన శ్రీ వరాహస్వామి, శ్రీనివాసుడు ఇద్దరు భక్తుల భక్తి సిద్ది కొరకు, కళ్యాణ సిద్ది కొరకక, విశ్వశ్రేయస్సుకై భూలోకవైకుంఠమైన ఏడుకొండలపై విరాజమానులయ్యారు. కలికాలంలో మానవులను ఉద్దరించి తరింపచేయడానికి వీరిద్దరు వేంకటాచలంలో కొలువుతీరి భక్తకోటికి కొంగు బంగారమై, పరిపూర్ణమైన ఆధ్యాత్మికానుభూతిని భక్తులకు ప్రసరింపచేస్తున్నారు.