విజేందర్ పంచ్‌లకు కుప్పకూలిన రోయర్.. విజేతగా భారత బాక్సర్.. సచిన్ ట్వీట్!
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. కెరీర్‌లో వరుసగా ఐదో బౌట్‌లోనూ నాకౌట్ విజయంతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. శనివారం స్ట్రాట్‌ఫోర్డ్‌లోని కాపర్ బాక్స్ ఎరెనాలో జరిగిన మ్యాచ్‌లో విజేందర్ ఫ్రాన్స్ బాక్సర్ మాతియోజ్ రోయర్‌తో బరిలోకి దిగాడు. ఈ బౌట్‌లో విజేందర్ సాంకేతిక నాకౌట్ ద్వారా గెలుపును నమోదు చేసుకున్నాడు.
ఆద్యంతం మెరుగైన పంచ్‌లతో అదరగొట్టిన విజేందర్ ఆరు రౌండ్ల బౌట్‌లో మరో రౌండ్ మిగిలివుండగానే రోయర్ పనిపట్టాడు. తద్వారా గెలుపును నమోదు చేసుకున్నాడు. ఐదో రౌండ్ ఆరంభంలోనే విజేందర్ దెబ్బలకు ఓర్చుకోలేక రోయర్ కుప్పకూలిపోగా, వైద్యుడిని సంప్రదించిన రిఫరీ సాంకేతిక నాకౌట్ ద్వారా విజేందర్‌ను విజయం వరించినట్లు ప్రకటించాడు.
ఇకపోతే.. విజేందర్‌ను క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పంచ్‌లతో విజేందర్ అదరగొట్టాడని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.