వివాదంలో హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ - వధువుకు మలేషియా వార్నింగ్!
భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వివాహం ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన తన స్నేహితురాలు, మలేషియాకు చెందిన ఇలి నజ్వా సిద్ధిఖ్వీని ఇటీవల పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఇపుడు వివాదంలోకి లాగింది. దీనికి బలమైన కారణం లేకపోలేదు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మలేసియాలో ముస్లిం మత సంప్రదాయాలను చాలా నిక్కచ్చిగా పాటించాలి. ఇక ముస్లింలు ఏ మాత్రం గీత దాటినా చాలా కఠినమైన శిక్షలుంటాయి. మన్ ప్రీత్ సింగ్ ఇలి నజ్వాను పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం, ఆ చిత్రాలు వైరల్ కావడంలో పలువురు మలేసియన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
నజ్వా మతం మార్చుకుందా? ముస్లిం యువతి అయ్యుండి ఇలాంటి వివాహం ఎలా చేసుకుంది? అంటూ మలేషియా పౌరులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఈ నజ్వా వివాహంపై మలేషియాలో పెద్ద చర్చేసాగుతోంది. దీంతో ప్రభుత్వం స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో మలేసియా ఉప ప్రధాని, మత వ్యవహారాలను పరిశీలించే అహ్మద్ మర్జుక్ స్వయంగా స్పందించారు. తమకు ఇలి నజ్వా పెళ్లిపై సమాచారం లేదని తేల్చి చెప్పారు. విమానాల్లో ప్రయాణాలకు ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపిన ఆయన, నజ్వా అనుమతి తీసుకునే ఇండియాకు వెళ్లిందని అన్నారు. ఆమె తన పెళ్లిపై స్వదేశానికి వచ్చి, అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సివుందన్నారు.
ఆమె సొంత రాష్ట్రం అధికారుల నుంచి కూడా వివరాలను కోరామని, విదేశాల్లో వివాహం చేసుకోవాలంటే, ముందుగా అనుమతి తీసుకోవాలని, కానీ ఆమె ఎలాంటి దరఖాస్తు పంపలేదని స్పష్టం చేశారు.
తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, ఆమె ఇప్పటికీ మతం మారలేదని, ముస్లింగానే ఉంటూ పంజాబీని వారి సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టు తేలితే మాత్రం తప్పు చేసినట్టుగానే భావించాల్సి వుంటుందని మర్జుక్ తెలిపారు. ఈ విషయంలో కొత్త జంట స్పందించాల్సి వుంది.