పారిస్ ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు నగదు వర్షం
పారిస్ కేంద్రంగా సాగుతున్న ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. దీంతో జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్యం సాధించిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించింది. ఇక జట్టులోని సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షలు అందచేస్తామని తెలిపింది.
కాగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాన్ని ముద్దాడినట్టయింది.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన జట్టుపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆటగాళ్లను మెచ్చుకున్నారు. వరుసగా రెండో ఒలింపిక్‌లోనూ పతకం గెలవడం అసాధారణమైన విజయమని కొనియాడారు. ఈ నగదు బహుమతి క్రీడాకారులు ప్రయత్నాలకు ఒక ప్రశంస మాత్రమేనని దిలీప్ టిర్కీ వ్యాఖ్యానించారు.