వినేశ్‌కు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ నజరానా!
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు పంజాబ్ రాష్ట్రంలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా 50 కేజీల మహిళా ఫ్రీ స్టైల్ పోటీల ఫైనర్ పోరుకు కొన్ని గంటల ముందు అనర్హత వేటు గురయ్యారు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ బౌట్‌కు ముందు ఆమెపై అనర్హత వేటు పడిన తర్వాత లవ్లీ వర్శిటీ ఈ ప్రకటన చేసింది.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ.. 'మాకు వినేశ్ ఇప్పటికీ పతక విజేతే. ఆటపై ఆమె అంకితభావం, నైపుణ్యం చాలా గొప్పవి. ఈ గుర్తింపునకు ఆమె అన్ని విధాల అర్హురాలు. ఆమెకు రూ.25 లక్షల నగదు బహుమతిని అందించడం మాకు గర్వకారణం' అని అన్నారు.
కాగా, తమ విద్యార్థులు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ.50 లక్షలు, రజతం గెలిస్తే రూ.25 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.10 లక్షలు ఇస్తామని గతంలో ఎల్పీయూ ప్రకటించింది. అందుకే ఫైనల్ వరకు వెళ్లిన వినేశ్‌కు ఇప్పుడు రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
ఇదిలావుంటే.. వినేశ్ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్‌లో ఆఖరి నిమిషంలో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ పోటీలకు ముందు నిర్వాహకులు ఆమె బరువు చెక్ చేశారు. ఆ సమయంలో వినేశ్ 100 గ్రాములు అదనపు బరువుతో ఉన్నట్టు గుర్తించారు.
దాంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. దీంతో పతకం ఖాయం అనుకున్న వినేశ్ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కెరీర్‌కు ముగింపు పలికారు. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతూ వినేశ్ ఫోగాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.