సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (23:56 IST)

రాత్రికి రాత్రి వినేశ్ బరువు పెరిగిపోయింది.. ఇందులో ఆమె తప్పు లేదు : భారత రెజ్లింగ్ సమాఖ్య

vinesh phogat
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో మహిళల ఫ్లీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోరుకు కొన్ని గంటల ముందు భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‍‌పై అనర్హత వేటు పడటాన్ని కోట్లాది మంది భారతీయ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో వినీశ్ తప్పిదం కూడా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, వినేశ్ బరువు పెరగడానికి కారణాలు ఏంటంటూ వారు ఆరా తీస్తున్నారు. కేవలం వంద గ్రాముల బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఇందులో వినేశ్ తప్పేం లేదంటూ ఆమెకు అండగా నిలిచారు.
 
'ఫైనల్‌‍కు చేరి ఏదో పతకం ఖాయమే అని అనుకున్న సమయంలో ఇలా వినేశ్‌పై అనర్హత వేటు పడటం దురదృష్టకరం. అది కూడా కేవలం అదనపు బరువు కారణంగా భారత్ ఒక పతకం కోల్పోవడం తీవ్ర విచారకరం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తప్పు చేసినట్లు భావించడం లేదు. రెండు రోజుల పాటు ఆమె బరువు స్థిరంగానే ఉంది. రాత్రికి రాత్రి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కారణమేంటనేది ఆమె కోచ్, న్యూట్రిషనిస్ట్, సహాయక సిబ్బందే వివరణ ఇవ్వాలి. దీనిపై విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
ఇక, వినేశ్ వ్యవహారంపై న్యాయపరంగా ముందుకు వెళ్లనున్నట్లు సంజయ్ తెలిపారు. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వినేశ్‌కు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వినేశ్ సహా స్టార్ రెజ్లర్లు గతేడాది తీవ్ర ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్‌ను ఎన్నుకున్నారు. అయితే, ఆయన బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు కావడంతో సంజయ్ ఎన్నికపైనా రెజ్లర్లు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.