ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (22:22 IST)

అనర్హత వేటు తర్వాత ఆస్పత్రి పాలైన వినేశ్ ఫొగాట్... ఫోటో షేర్ చేసిన పీటీ ఉష

vinesh phogat
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జీవితంలో చీకటి రోజుగా బుధవారం మిగిలిపోయింది. ఒలింపిక్ క్రీడా పోటీల్లో భాగంగా, 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ విభాగం కేటగిరీలో ఆమె పోటీలో పాల్గొనకుండా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. నిర్ణీత బరువు 50 కేజీల కంటే 100 గ్రాములు అధికంగా ఉన్న కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెతో పాటు 140 కోట్ల భారతీయులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే వినేశ్ ఆస్పత్రి పాలయ్యారు. డీహైడ్రేషన్ కారమంగా ఆమె అనారోగ్యం బారినపడ్డారు. దాంతో వినేశ్‌ను ఒలిపింక్ గ్రామంలోని ఓ క్లినిక్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 
 
మంగళవారం బౌట్ సమయంలో కూడా ఆమె తన బరువును నియంత్రణలోనే ఉంచుకున్నారు. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల బరువు ఒక్కసారిగా పెరిగిపోయారు. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి బరువు తగ్గే వ్యాయామాలు చేశారు. చివరకు శరీరం నుంచి కొంత రక్తాన్ని కూడా వెలికి తీయడం, జుట్టు కత్తిరించడం వంటివి కూడా చేసినట్టు సమాచారం.  
 
అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్టు సమాచారం, దీని కారణంగానే వినేశ్ ఇపుడు డీహైడ్రేషన్‌కు గురైనట్టు క్రీడాపండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఒలింపిక్ విలేజ్‌లోని ఓ పాలిక్లినిక్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె చికిత్స తీసుకుంటున్న ఫోటోను సైతం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడింది. దయచేసి వినేశ్ ఫొగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా నడుచుకోవాలని కోరుతున్నారు. ఇది అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది.