శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (22:37 IST)

అధిక బరువుకు వినేశ్ ఫొగాట్ కూడా బాధ్యురాలే.. సైనా నెహ్వాల్ కీలక కామెంట్స్

saina nehwal
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విషయంలో తప్పు ఎలా జరిగిందనే విషయం ప్రశ్నార్థకంగా మారిందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అంటున్నారు. అధిక బరువు కారణంగా ఒలింపిక్ పోటీల నుంచి వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెల్సిందే. దీనిపై సైనా నెహ్వాల్ స్పందిస్తూ, సాధారణంగా ఇలాంటి తప్పులు ఏ అథ్లెట్ విషయంలోనూ జరగవన్నారు. కానీ ఇది ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వినేశ్ ఫొగాట్‌కు ఇదే మొదటి ఒలింపిక్స్ కాదని, బరువు పెరిగిన విషయంలో ఆమె కూడా ఇందుకు బాధ్యురాలేనని చెప్పారు. ఆమె వెంట ఉన్న చాలా మంది కోచ్‌లు, ఫిజియోలు, ఎంతో బాధలో ఉన్నారని, రెజ్లింగ్ నిబంధనలు తనకు తెలియవని, కానీ ఫొగాట్ విషయంలో తాను చాలా బాధపడుతున్నట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, ఫొగాట్ గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. ఇపుడు ఆమె బరువు పెరిగివుండొచ్చు. కానీ, ఆమె ఓ ఫైటర్. వచ్చేసారి ఖచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించడానిక ప్రతి అథ్లెట్ కఠినమైన శిక్షణ తీసుకుంటారని పేర్కొన్నారు. వినేశ్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంటే, అధిక బరువు రూపంలో ఆమెకు దురదృష్టం వెంటాడిందని పేర్కొన్నారు. 
 
కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. కేవలం 100 గ్రాముల అదనంగా బరువు పెరిగి ఉండటంతో నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు క్రీడా రాజకీయ, సినీ ప్రముఖులు ఫొగాట్‌కు సంఘీభావం తెలుపుతున్నారు.