గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (09:19 IST)

'కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను...' - వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం

vinesh phogat
భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. "కుస్తీ నాపై గెలిచింది.... నేను ఓడిపోయాను.. నన్ను క్షమించు... మీ కల.. నా ధైర్య విచ్ఛిన్నమైంది. ఇక నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను" అంటూ ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
 
అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్‌కు చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదువార్త వినాల్సి వచ్చింది.
 
ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్'ను ఆశ్రయించింది. తాను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లమంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది.