శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (09:41 IST)

సిల్వర్ మెడల్‌కు అర్హురాలిని.. కోర్టును ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్

vinesh phogat
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనకుండా తనపై అనర్హత వేటు వేయడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె.. శాశ్వతంగా ఆ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. అదేసమయంలో న్యాయపోరాటానికి దిగారు. తనపై అనర్హత వేటు వేయడాన్ని ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను (సీఏఎస్) ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులో తాను సిల్వర్ పతకానికి అర్హురాలినంటూ పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై ఆర్బిట్రేషన్ తన తీర్పును గురువారం వెలువరించనుంది. అంతలోపే ఆమె తన కెరీర్‌కు స్వస్తి చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించారు.
 
నిజానికి వినేశ్‌ ఇప్పటివరకు 53 కేజీల విభాగంలో పోటీపడుతూ వచ్చింది. కానీ పారిస్ ఒలింపిక్స్​లో అప్పటికే ఆ విభాగంలో మరో భారత రెజ్లర్ అంతిమ్‌ అర్హత సాధించడం వల్ల వినేశ్‌ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చింది. ఇందుకోసం ఆమె తీవ్రంగా శ్రమించింది. కానీ ఫైనల్స్ సమయానికి ఆమె కొన్ని గ్రాముల బరువు ఉన్నందున ఆమె అనర్హత వేటు పడింది. అయితే ఆ 100 గ్రాములు తగ్గించుకోవడానికి మరికొంత సమయం తనకు ఇవ్వాలంటూ అధికారులను బతిమాలినా కూడా ఆఖరికి ఫలితం లేకుండా పోయింది.
 
అయితే వినేశ్‌కు ఇది తొలి ఒలింపిక్స్‌ కాదు. ఇప్పటికే రెండుసార్లు ఆమె ఈ విశ్వక్రీడల్లో పాల్గొంది. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో ఆమె పెర్ఫామెన్స్​ అంత గొప్పగా ఏమీ సాగలేదు. క్వార్టర్స్‌లో ఓటమిపాలై వెనుతిరిగింది. అయితే 2016లో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌కు తీవ్రగాయమైంది. మోకాలు మెలిక పడి లేవలేని స్థితికి చేరుకుంది. దీంతో కాలికి పెద్ద కట్టుతో ఆమె స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ గాయం కారణంగా వినేశ్ పతకాన్ని కోల్పోయింది.