రియో ఒలింపిక్స్ : అంబాసిడర్ల జాబితాలో సచిన్, ఏఆర్ రెహ్మాన్
రియోలో ఈ ఏడాది జరుగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీల్లో బరిలోకి దిగే భారత జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఇప్పటికే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నియామకమైన నేపథ్యంలో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని క్రికెట్ దేవుడు, క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
అయితే దీనిపై సచిన్ స్పందించాల్సి వుంది. ఇక సచిన్‌తో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్‌ను కూడా భారత్ నుంచి వెళ్లే బ్రాండ్ అంబాసిడర్ల టీమ్‌లో చేర్చాలని ఐఓఏ భావిస్తోంది. బ్రెజిల్‌లోని రియోలో ఆగస్టు ఐదో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఒలింపిక్ క్రీడోత్సవాలు అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఉత్సవాలకు భారత జట్లతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి వ్యక్తి వెళ్లడం ద్వారా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఐఓఏ భావిస్తోంది. మరి ఒలింపిక్ సంఘం విజ్ఞప్తిపై సచిన్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.