రియో ఒలింపిక్స్: భారత రాయబారిగా సల్మాన్ ఖాన్.. సమర్థించుకున్న గంగూలీ!
క్రీడలకు క్రీడాకారులతో పాటు సినీ నటుల భాగస్వామ్యం చాలా అవసరమని.. అలా క్రీడాకారులు- సెలెబ్రిటీలు భాగస్వామ్యం కావడం ద్వారానే ఐపీఎల్, ఐఎస్ఎల్‌లు సక్సెస్ అయ్యాయని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో భారత ఆటగాళ్ల బృందానికి సహృద్భావ రాయబరిగా కండలవీరుడు నియామకాన్ని గంగూలీ సమర్థించుకున్నారు.
సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా మరికొందరిని రాయబారులుగా నియమిస్తే మంచిదేనని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఒక్కరినే ఎంపిక చేయాలనే నియమం లేదని గంగూలీ తెలిపాడు. సల్మాన్ ఖాన్ రియో ఒలింపిక్స్‌కు మరింత ఆకర్షణ తెస్తాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిలో మరికొందరిని కూడా రియో ఒలింపిక్స్‌లో భాగస్వామ్యం చేయాలని గంగూలీ పిలుపునిచ్చారు.
ఇకపోతే.. హిట్ రన్ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ కోర్టుల వెంట తిరిగిన నేపథ్యంలో అతనిని ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ఆడే భారత జట్టుకు రాయబారిగా ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు గంగూలీ అండగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.