ఆసియా క్రీడలు : తెలంగాణ బిడ్డకు కాంస్య పతకం
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ బిడ్డ కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె పేరు అగసర నందిని. సోమవారం జరిగిన హెప్టాథాన్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రీడాంశంలో నందిని 57.12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
అయితే, ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో అథ్లెట్ స్వప్న బర్మన్ 57.08 పాయింట్లు సాధించి త్రుటిలో పతకం చేజార్చుకుంది. దాంతో, స్వప్న బర్మన్... అగసర నందినిపై అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను ఒక 'ట్రాన్స్‌జెండర్' కారణంగా కాంస్య పతకాన్ని కోల్పోయానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అయితే, ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో స్వప్న వెంటనే తన పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. కానీ అప్పటికే ఆమె వ్యాఖ్యలు మీడియాకెక్కాయి. ఈ నేపథ్యంలో, తోటి అథ్లెట్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్వప్న బర్మన్ మూల్యం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి.