మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (10:57 IST)

ఖాళీ స్టేడియాల్లో ఒలింపిక్స్ క్రీడలు

జపాన్ దేశ రాజధాని టోక్యో కేంద్రం వేదికగా ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం జరుగనుంది. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ కమిటీ యూటర్న్ తీసుకుంది. 
 
ఈ పోటీలకు ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన కమిటీ తాజాగా మరో ప్రకటన చేస్తూ.. ఖాళీ స్టేడియంలోనే క్రీడలు నిర్వహించాలన్న ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోలేదని ప్రకటించింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో శుక్రవారం వెల్లడించారు.
 
మరోవైపు, జూలై 23వ తేదీ నుంచి ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించబోమని చాలా నెలల క్రితమే ప్రకటించారు. అయితే, స్థానికుల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 50 శాతానికి మించకుండా గరిష్ఠంగా 10 వేల మందిని అనుమతించాలని నిర్ణయించారు. 
 
కానీ, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న అంశం తమ పరిగణనలోనే ఉందన్న సీకో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జపాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతోనే ప్రేక్షకులు లేకుండానే క్రీడల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. కాగా, ఈ పోటీలు గత యేడాది జరగాల్సివుండగా, కరోనా కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే.