శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:59 IST)

చంద్రబాబు సలహాతోనే లగడపాటి మైండ్ గేమ్ ఆడారా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మైండ్ గేమ్ ఆడారా? ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్భలంతో ఆయన ఈ పనికి పాల్పడ్డారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ నేతలు. 
 
తెలంగాణ ఎన్నికల్లో ఒక్క లగడపాటి సర్వే మినహా మిగిలిన సర్వేలన్నీ తెరాస విజయభేరీ మోగిస్తుందని స్పష్టం చేశాయి. కానీ, లగడపాటి సర్వే ఒక్కటే ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంటే తన ఎగ్జిట్ జోస్యంతో తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బతీసే ప్ర‌య‌త్నం చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. త‌ప్పుడు లెక్క‌ల‌తో మైండ్ గేమ్ ఆడారని వారు ఆరోపిస్తున్నారు. 
 
కానీ తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్ పాల‌న‌నే న‌మ్ముకున్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కే ప‌ట్టం క‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు వేయ‌డంలో రాజ‌గోపాల్ దిట్ట అన్న పేరుంది. కానీ తెలంగాణ విష‌యంలో ఆయ‌న ఆంధ్రా కుటిల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. నైతికంగా తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేశారు. 
 
తెరాసకు కేవ‌లం 35 సీట్లు వ‌స్తాయ‌ని త‌న పోల్ భ‌విష్య‌త్తును వినిపించారు. 65 సీట్ల‌తో ప్ర‌జాకూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని జోస్యం చెప్పారు. కానీ తెలంగాణ ఓట‌ర్లు త‌మ విచ‌క్ష‌ణ‌ను చూపించారు. తెలంగాణ సెంటిమెంట్‌లో లోపం లేద‌ని తమ ఓటు ద్వారా చూపారు. చంద్రబాబు ప్రోద్భలంతో నీచ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆంధ్రా అక్టోప‌స్‌కు.. తెలంగాణ ఓట‌ర్ల త‌మ‌దైన శైలిలో ఓటు రుచి చూపించారు.