శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (16:47 IST)

మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత.. ఆందోళనకరం

మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన గత కొంతకాలంగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ వచ్చారు. 
 
అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. గెలుపు కోసం ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‍కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అంతేకాకుండా, భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. లోబీపీతో పాటు గుండెల్లో విపరీతమైన నొప్పి, వాంతులతో ఆయన బాధపడ్డారు. ఈ కారణంగానే ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.