లగడపాటి సర్వే ఫలితాలపై సర్వత్రా చర్చ... ఈసీ పరిధిలోకి రావా?
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమల శ్రీవారి సన్నిధి వద్ద మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని తెలిపారు. అంతేనా, ఇద్దరి పేర్లను కూడా వెల్లడించారు. అలాగే, రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
లగడపాటి రాజగోపాల్ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయా.. రావా అనే అందరిలో చర్చనీయాంశమైంది. పోలింగ్‌కు వారం ముందు సర్వే ఫలితాలను ఎలా వెల్లడిస్తారని ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లగడపాటి సర్వేలు ఓటర్లపై ప్రభావం చూపిస్తాయని.. ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం అని ఆయా నియోజకవర్గాల ప్రధాన పార్టీ అభ్యర్థులు అంటున్నారు.
మిగతా అభ్యర్థుల వివరాలు వెల్లడించకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి పార్టీలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కాదు అని లగడపాటి ఎలా సమర్ధించుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నాయి పార్టీలు. ఆయా నియోజకవర్గాల్లో ఫలానా అభ్యర్థి గెలుస్తున్నాడు అని పేర్లతో సహా ప్రకటించటం అంటే.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ప్రధాన పార్టీలు అంటున్నాయి. లగడపాటి సర్వే ఫలితాల ప్రకటను వెంటనే అడ్డుకోవాలని ఈసీని కోరనున్నట్లు సమాచారం.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి వెల్లడించే సర్వే ఫలితాలపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన గురి, నమ్మకం ఉంది. ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇందు వల్లనే చాలా పార్టీలు సర్వే ఫలితాల కోసం ఆయన్ను ఆరా తీస్తుంటాయి. ఈసారి ఆయన పేరుతో బోలెడు వార్తలు వచ్చినా.. వాటిని స్వయంగా కొట్టిపారేశారు. నా నోటితో చెప్పిందే నిజం అని తేల్చి చెప్పారు. డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం మాత్రమే ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని వెల్లడిస్తాని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్... ఇపుడు ఎవరూ ఊహించని విధంగా ఇద్దరి గెలుపును ప్రకటించేశారు. నారాయణపేట, బోధ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతారని వెల్లడించారు.