శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (09:11 IST)

తెలంగాణ ఎన్నికలు : 6 రోజులు.. రూ.1000 కోట్లు.. ఏరులై పారనున్న మద్యం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇక ఆరు రోజులు మాత్రమే. ఈనెల 7వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈనెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తంకానుంది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని పార్టీల నేతలు వ్యూహాల్లో మునిగిపోయారు. ఇందులో చివరి అస్త్రాలను బయటకు తీస్తున్నారు. 
 
అదే మద్యం.. డబ్బు. చివరి నిమిషంలో కాస్త అటూ ఇటూగా ఉండే ఫలితాలను శాసించేది ఈ రెండే అని నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో వారు తమ చివరి అస్త్రంగా డబ్బు, మద్యం ఉపయోగిస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు‌, పోలీసులు కళ్లుగప్పి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
ఇప్పటికే మండల స్థాయిలో మద్యం నిల్వలు పెరుగుతున్నాయి. గోడౌన్లలోకి మద్యం.. గ్రామస్థాయి నేతల ఇళ్లలోకి నోట్ల కట్టలు చేరిపోయాయి. విదేశాల నుంచి కూడా హవాలా మార్గాల్లో పెద్దఎత్తున నగదు రాష్ట్రానికి చేరుతోంది. పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ నిఘా పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకులు ముందుగానే తరలిస్తున్నారు. 
 
ఎన్నికల ప్రచారం చివరి రోజున మద్యం ఏరులై పారనుంది. ఒకటి కాదు రెండూ కాదు. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఈ మొత్తం నిధులు చేతులు మారనుంది. ఈ సొమ్మును పకడ్బందీగా చేతులు మార్చేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఎరువుల దుకాణాలు, రైసు మిల్లులు, కిరాణా షాపులను ఎంచుకున్నారు. ఇక సర్పంచులు, బంధుమిత్రులు, మహిళా సంఘాలను నగదు పంపిణీకి నియమించుకున్నారు.