ఎగ్జిట్ పోల్స్ రబ్బీష్ ... హ్యాట్రిక్ కొడతాం.. అధికారం మాదే : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ 30 లోపు సీట్లకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనాలు వేశాయి. ఈ ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. డిసెంబరు మూడో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో మరోసారి విజయం సాధించేది భారాసయేనని.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు రబ్బీష్ అంటూ కొట్టిపారేసారు.
ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు. ఇంకా పోలింగ్ జరుగుతుండగానే.. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం సరికాదన్నారు. పోలింగ్ కోసం వరుసల్లో నిలబడే అత్యధికుల వద్ద ఫోన్లు ఉంటాయని, ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఓటర్లపై పడే అవకాశాలుంటాయని వెల్లడించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఈ విషయంపై మాట్లాడితే.. ఎన్నికల సంఘం నిబంధనలు అలాగే ఉన్నాయని చెప్పారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై ఆలోచించి.. భవిష్యత్తులోనైనా ఇలా పోలింగ్ ముగియకుండా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసే విధానాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
'గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు. పోలింగ్ శాతం తగ్గిందనేది సమస్య కాదు. ఎంత ఓటింగ్ జరిగితే.. అందులో సగానికిపైగా వస్తే వారిదే విజయం. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానితో సంబంధం లేకుండా మా విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నాం.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని నిరూపించడం మా పార్టీకి కొత్త కాదు. 2018లో కూడా ఇలాంటి తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌లో ప్రజలను అయోమయానికి గురిచేశారు. అప్పుడు కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయి. ఇపుడు ఒకటి రెండు మినహా, మిగిలిన అన్ని సంస్థలు వెల్లడించిన ఫలితాలు తప్పని డిసెంబరు 3వ తేదీన తెలుస్తుందన్నారు.