1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (08:52 IST)

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 70.66 శాతం

voters
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గురువారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 70.66 శాతం మపోలింగ్ నమోదైంది. నగరాలు, పట్టణాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించపోగా, పల్లె ఓటర్లు మాత్రం బారులు తీరారు. దీంతో చెదురుమదురు సంఘటనలు మినహా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. 
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం రికార్డయింది. తదుపరి స్థానాల్లో మెదక్ (86.69), జనగామ (85.74), నల్గొండ (85.49), సూర్యాపేట (84.83%) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్ నమోదైంది. 
 
మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగగా.. సంగారెడ్డి జిల్లా హత్‌నుర మండలం రెడ్డిఖానాపూరులో రాత్రి 8 గంటల వరకు, షాద్‌‍నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు, తిమ్మాపూర్లలోని పోలింగ్ కేంద్రాలలో రాత్రి 8.30 దాటాక కూడా పోలింగ్ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 9.30 వరకు సాగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండటంతో వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 
 
తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియగా అక్కడ కూడా అప్పటికే క్యూలలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి, జనగామ, ముథోల్, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్ తూర్పు తదితర నియోజకవర్గాల్లో స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించటంతో సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్ ఆలస్యమైంది. పలు ప్రాంతాల్లో భారాస అభ్యర్థులు పార్టీ కండువాలతో కేంద్రాలకు రావటం వివాదమైంది. ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు.