శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (15:38 IST)

సిర్పూర్ అసెంబ్లీ స్థానంపై ఆశలుపెట్టుకున్న మాజీ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్!

pravin kumar
కొమరంభీం జిల్లా జిల్లాలోని ఈ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థిని రెండేసి సార్లు గెలిపించింది. 1962 నుండి 1978 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1983, 1985, 1999 లలో తెలుగుదేశం గెలుపొందింది. 2004 ఎన్నికలలో విజయం కాంగ్రెస్‌కు వరించింది. ఈ నియోజకవర్గం మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాష్ట్రంలోనే మొదటి నంబరు శాసనసభ నియోజకవర్గ స్థానం ఈ నియోజకవర్గానికి లభించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం తొలి నంబరు ఉండగా 2008 నాటి నియోజకవర్గముల పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆ స్థానం దీనికి లభించింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్. ఈ స్థానం ఎన్నికలు ఈ దఫా అమితాసక్తిగా మారాయి. తన ఐఏఎస్ కొలువుకు రాజీనామా చేసిన సీనియర్ అధికారి ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే, ఈయన బహుజనవాదంతో బరిలోకి దిగారు. సొంత జిల్లాను కాదని సిర్పూరులో పోటీ చేస్తున్నారు. 
 
ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ ఎవరి శైలిలో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గంలో స్వచ్చంద సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తొలి నుంచీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఈ దఫా ఎన్ని కల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ బహుజన వాదాన్ని తెరపైకి తెస్తూ బరిలోకి దిగడంతో ఇక్కడ ఎన్నికల సీన్ మొత్తం మారిపోయింది. 
 
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్‌ కుమార్.. ఆ జిల్లాను కాదని, రాష్ట్రంలో మరో చివరన ఉన్న సిర్పూర్‌కు వచ్చి పోటీ చేస్తున్నారు. ఇందుకు కారణం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటం, గతంలో ఈ నియోజకవర్గంలో బీఎస్పీ గెలిచిన చరిత్ర ఉండటమే. కాగా, ప్రవీణ్ కుమార్ రాకతో.. ముందునుంచీ ముక్కోణపు పోటీ ఉంటుందన్న పరిస్థితి కాస్తా.. చతుర్ముఖ పోటీగా మారింది. 
 
ఎమ్మెల్యే కోనప్ప గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగతంగా అమలు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ పాల్వాయి హరీశాబాబు ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. పార్టీ బలం కన్నా.. తన తల్లిదండ్రులైన పాల్వాయి రాజ్యలక్ష్మి, పురుషోత్తంరావుకు ఉన్న పేరు ప్రతిష్ఠలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇక 2014 నుంచి వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు తనను గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు.
 
సిర్పూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,22,973
మహిళా ఓటర్లు 1,11,039
పురుష ఓటర్లు 1,11,924
ఇతరులు 10 
 
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే, 
కొనేరు కోనప్ప 83088 
పాల్వాయి హరీష్ బాబు 59052
డా.కొత్తపెల్లి శ్రీనివాస్ బీజేపీ 6279
రవి శ్రీనివాస్ 5379
తాళ్లపల్లి తిరుపతి 4039
నోటా 1579
దాసరి వెంకటేష్ 1079
చిలకమ్మ ఎడ్ల 1013
కుడక కిషోర్ 733
గంటా పెంటన్న 595
జాడి దిలీప్ 512
కోట వెంకన్న 511
రాంచందర్ 429