సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (13:06 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్ ఖాతాలో మూడో విజయం

makkan singh
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుంది. ఇప్పటికే అశ్వారావుపేట, ఇల్లెందు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ .. ముచ్చటగా మూడో స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్‌లోని రామగుండం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఘన విజయం సాధించారు. మక్కాన్ సింగ్ గెలుపుతో కాంగ్రెస్ ఖాతాలో మూడు సీట్లు చేరాయి. 
 
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా బోటీ కొట్టింది. చార్మినార్  నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌ను ఆయన ఓడించి గెలుపును సొంతం చేసుకున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు : కాంగ్రెస్ ఖాతాలో మరో గెలుపు  
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళుతుంది. ఈ ఎన్నికల్లో ఇప్పటికే తొలి విజయాన్ని నమోదు చేసుకున్న కాంగ్రెస్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య భారీ మోజార్టీతో గెలుపొందారు. ఈయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై ఏకంగా 38 వేల మెజార్టీతో విజయభేరీ మోగించారు. ఇప్పటికే అశ్వారావు పేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ గెలుపొందిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెపోతుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 70కి పైగా స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. అధికార భారత రాష్ట్ర సమితి మాత్రం 34 చోట్ల, భారతీయ జనతా పార్టీ 9, ఎంఐఎం 5, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్ తరపున తొలి విజయం  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరపున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆది నారాయణ ఘన విజయం సాధించారు. మొత్తం 28358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 40 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఒక బీజేపీ కేవలం 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూడా వెనుకంజలో ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఆరుగురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే, ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఈయన 38 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.