గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (05:38 IST)

తెలంగాణలో విదేశీయుల కోసం అన్వేషణ

కరోనాపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సాయం కోరింది. విదేశాల నుంచి వచ్చినవారిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసింది. కొందరు విదేశాల నుంచి వచ్చి కూడా తమ వివరాలు బయటకు వెల్లడి కాకుండా చూసుకోవడం.. వైద్య, ఆరోగ్యశాఖకు వెల్లడించకపోవడంతో ప్రభుత్వం ఐబీ సహకారం తీసుకుంది.

కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలతో ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశ వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఇంటెలి జెన్స్‌ బృందాలు విదేశాల నుంచి వచ్చిన 18 వేల మంది వివరాలను సేకరించాయి.

ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్‌లను గుర్తించాయి. ఇంకా ఎవరెవరు అందుబాటులో లేకుండా ఉన్నారన్న దాని పైనా ఇంటెలిజెన్స్‌ వర్గాలు జల్లెడ పడుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి జాబితా తీసుకొని వారిని గుర్తిస్తున్నాయి. గత 3 రోజుల్లోనే యూకే నుంచి ఏకంగా 100 మంది వచ్చారని ఒక ఇంటెలిజెన్స్‌ అధికారి తెలిపారు.

‘తెలంగాణ కోవిడ్‌ యాప్‌’ప్రారంభం...
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఈ యాప్‌ను ఎలా వినియోగించాలన్న దానిపై కలెక్టర్లకు ప్రజారోగ్య సంచాలకులు లేఖ రాశారు. ఎలాంటి సమాచారం పంపాలన్న దానిపైనా వారికి మార్గదర్శకాలిచ్చారు.

గ్రామాలవారీగా ఉండే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారు, అనుమానిత కేసులు, కోవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. రాష్ట్రంలో 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 8 వేల మంది, 31 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలుంటారు.

వారిలో చాలామంది వద్ద ట్యాబ్‌లున్నాయి. ట్యాబ్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. వారంతా ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే చేపడతారు. ఆ సర్వే వివరాలను ప్రతీ రోజూ వారు తమ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.