ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (12:38 IST)

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం - నేడు మార్గదర్శకాలు ఖరారు

free bus travel
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండింటిని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించారు. ఇందులో ఒకటి.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం శనివారం నుంచి అమలుకానుంది. 
 
ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్‌కు ప్రాథమిక సమాచారం అందించారు. శుక్రవారం కూడా అధ్యయనం కొనసాగనుంది.
 
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశానికి శుక్రవారం అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం చేరవేశారు. ముఖ్యమంత్రితో భేటీలో ఆయా అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు.
 
అయితే, కర్ణాటక ప్రభుత్వం జూన్ నెల నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది. ఆ రాష్ట్రంలో 22 వేల పైచిలుకు బస్సులున్నాయి. తెలంగాణలో బస్సుల సంఖ్య 8,571గా ఉంది. 'ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40-41 శాతంగా ఉండేదని సమాచారం. పథకం అమలు తర్వాత 12-15 శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది' అని ఆర్టీసీ అధికారి వెల్లడించారు.