బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (09:36 IST)

వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్... పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య!!

kadiyam kavya
త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఇతర పార్టీల్లోకి వలసలుగా వెళ్లిపోతున్నారు. తాజాగా వరంగల్ ఎంపీ స్థానం పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మూడు రోజుల క్రితమే భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే, ఆమె అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం ఇపుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆమె లేఖ ద్వారా తెలిపారు. 
 
గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పార్టీకి నష్టం జరగిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. నేతల మధ్య సమన్వయం కూడా కొరవడింది. అందుకే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కేసీఆర్, భారాస కార్యకర్తలు తనను క్షమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, కావ్య తన తండ్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కడియం కావ్యలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతుంది.